TEAM INDIA: పాక్‌తో ‘ఫైనల్’ సూర్యకుమార్ నినాదం
నో ఫియర్, బీ క్లియర్ అంటున్న సూర్య
ఇవాళ జరిగే ఆసియా కప్ ఫైనల్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ తుది పోరులో గెలిచి ఆసియా కప్ ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా సారధి సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. " తప్పకుండా ఆదివారం మ్యాచ్‌కు సిద్ధంగా ఉంటారని భావిస్తున్నా. లంకతో ఎలా ఆడామో.. అదే దూకుడు ప్రదర్శిస్తాం. మా కుర్రాళ్ల నుంచి కోరుకొనేది ఒక్కటే.. వారి ప్రణాళికలను అనుకున్నట్లుగా అమలుచేస్తే చాలు విజయం మనదే. స్పష్టతతో ఉండండి.. నిర్భయంగా ఆడేయండి. ఫైనల్లో ఆడబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని సూర్య వెల్లడించాడు. : బీ క్లియర్.. నాట్ టు ఫియర్ అంటూ జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపాడు. మరోవైపు శ్రీలంక యువ ఆటగాడు దునిత్ వెల్లలాగేను సూర్య పరామర్శించాడు. ఆసియా కప్‌లో ఆడుతున్నప్పుడే అతడి తండ్రి సురంగ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆయన అంత్యక్రియలకు వెళ్లిన దునిత్ వెంటనే జట్టుతో పాటు చేరాడు. భారత్‌తో మ్యాచ్‌లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా వెల్లలాగేతో మాట్లాడాడు. సూర్య ఓదారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ రోజు జరిగే మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది.
సూర్య గాడిన పడతాడా.?
ఆసియా కప్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఒక్క మ్యాచ్ మినహా.. మిగతా మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌లో ఆడి 71 రన్స్ మాత్రమే చేశాడు. టోర్నీలో 7* (2), 47* (37), 0 (3), 5 (11), 12 (13) రన్స్ చేశాడు. సూర్య ఐపీఎల్ 2025లో రెచ్చిపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున 16 మ్యాచ్‌లు ఆడి 717 రన్స్ బాదాడు. కానీ టీమిండియాకు మాత్రం విఫలమవుతున్నాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి అదిరిపోయే ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. శుభ్‌మన్ గిల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. కెప్టెన్ సూర్య ఈ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం ఫైనల్లోనైనా అతను బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్, అక్షర్ పటేల్ కూడా పర్వాలేదనిపించారు. శివమ్ దూబే బౌలింగ్‌లో రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ తిరుగు లేదు. ఈ ఇద్దరూ తమ బౌలింగ్‌తో మ్యాచ్‌ను తిప్పేస్తున్నారు. బుమ్రా కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఏ లెక్కన చూసుకున్నా.. పాకిస్థాన్ కంటే భారత్ రెండింతలు బలంగా కనిపిస్తోంది.
"4 బంతులన్నా నిదానంగా ఆడు"
ఆసియా కప్‌లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా సారధి సూర్యకుమార్ యాదవ్‌కు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. ‘‘సూర్య ప్రతిభ విషయంలో ఎవరికీ సందేహం లేదు. అతడు క్లాస్ ప్లేయర్. అయితే, పిచ్ పరిస్థితులను అంచనా వేసేందుకు కనీసం నాలుగు బంతులు ఎదుర్కోవాలి. బౌలర్ల పేస్, బౌన్స్, టర్న్‌పై ఓ అవగాహన వస్తుంది. డగౌట్లో కూర్చొని చూడటం, క్రీజ్‌లోకి వచ్చి ఆడటం భిన్నంగా ఉంటుంది." అని గవాస్కర్ అన్నాడు.