సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ దీనస్థితిలో ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కనీసం తనకు తానుగా నడవలేకపోతున్నాడు. అడుగులు తడబడి కిందపడే సమయంలో పొరుగున ఉన్న వ్యక్తులు ఆసరా అందించడంతో ఊపిరిపీల్చుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా కాంబ్లీకి కాలం కలిసిరాలేదు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించినందువల్లే అతడి కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిందని కాంబ్లీ సన్నిహిత వర్గాలు సైతం గతంలో వెల్లడించాయి. ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా కూడా చిక్కుల్లో పడ్డ వినోద్ కాంబ్లీ ఇంకా కోలుకోలేదని తాజా వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
నరేంద్ర గుప్తా అనే యూజర్ ఇన్స్టాలో ఈ దృశ్యాలను షేర్ చేశాడు. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్యోగం ఏమాత్రం బాలేదు. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో తాను బాధపడుతున్నట్లు వినోద్ కాంబ్లీ చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నాడు. అనారోగ్యం వల్ల ఎన్నోసార్లు ఆస్పత్రిబారిన పడ్డాడు వినోద్. హృదయ సంబంధిత వ్యాధులతో పాటు డిప్రెషన్ తోనూ అతడు బాధపడుతున్నాడు. త్వరలోనే అతడు కోలుకోవాలని.. అవసరమైన సాయం అతడి అందాలని కోరుకుంటున్నా" అని నరేంద్ర గుప్తా చెప్పాడు.