WC: 'అంధ' టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన తెలుగమ్మాయిలు
కెప్టెన్ దీపిక, అరుణకుమారి అద్భుత ప్రదర్శన
క్రికెట్లో భారతీయ అమ్మాయిలు అదరగొడుతున్నారు. వన్డే ప్రపంచకప్ గెలిచి నెల తిరగకముందే మరో ప్రపంచకప్ మన సొంతమైంది. ఈసారి అంధ మహిళలు టీ20 ప్రపంచకప్ విజేతలుగా నిలిచారు. ఈ విభాగంలో ఇదే మొట్టమొదటి ప్రపంచకప్. భారత జట్టులో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. వారిలో ఒకరు కెప్టెన్ దీపిక కాగా, మరొకరు కరుణ కుమారి. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టికి చెందిన వ్యవసాయ కూలీలు చిక్కతిమ్మప్ప, చిత్తమ్మ దంపతుల సంతానం దీపిక. తమ జీవితాల్లో వచ్చిన వెలుగుగా భావించి ఆమెకా పేరు పెట్టారు. కానీ వాళ్ల ఆనందం నెలలైనా నిలవలేదు. చేతి వేలు గోరు తగలడంతో అయిదు నెలల ప్రాయంలోనే దీపికకు ఒక కంటి చూపు పోయింది. కొన్నాళ్లు బాధపడ్డా, తర్వాత నుంచి పాపకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంత కష్టమైనా పడాలని నిర్ణయించుకున్నారు. ఎనిమిదో తరగతి తర్వాత నుంచి క్రికెట్లోనూ శిక్షణ తీసుకుంది దీపిక. పదో తరగతిలో ఉండగా అంధుల రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సెంచరీ చేసింది. 2019లో జాతీయ అంధుల మహిళల జట్టు ప్రారంభమైంది. అదే సమయంలో కర్ణాటక జట్టు కెప్టెన్‌గా ఎంపికైంది. ఆపై భారత జట్టులో చోటు సంపాదించింది.
కరుణ ప్రస్తుతం.. విశాఖపట్నంలోని ప్రభుత్వ అంధ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఈమె పూర్తిగా అంధులైన క్రీడాకారుల కోసం ఉద్దేశించిన బీ1 కేటగిరీలో టీమిండియాకు ఎంపికైంది. క్రికెట్ ఆడేటప్పుడు కరుణ.. ముఖ్యంగా బంతి శబ్దం మీదే ఆధారపడుతుంది. బంతి వస్తోన్న దిశను పసిగట్టి అమాంతం దాన్ని షాట్‌గా మలుస్తుంది. కరుణ ఆడే విధానాన్ని గమనించిన భారత మాజీ అంధ క్రికెట్ టీమ్ కెప్టెన్, ప్రస్తుత కోచ్ అజయ్ కుమార్ రెడ్డి.. ఆమె ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె టీమ్‌లో చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. మొదటిసారిగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో ఏపీ నుంచి ఓ తెలుగమ్మాయి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి.. విజేతగా నిలపడం శుభపరిణామమని అన్నారు.