AI: ఏఐ ఆధారిత ఉద్యోగాలకు గిరాకీ
దేశీయ ఉద్యోగ నియామకాల్లో ఏఐకు ప్రాధాన్యం;
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు ప్రాధాన్యత పెరుగుతోంది. దేశీయ ఉద్యోగ నియామకాల్లో ఏఐకు ప్రాధాన్యం పెరుగుతోందని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ నివేదిక వెల్లడించింది. ఏఐ సంబంధిత ఉద్యోగాలకు ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకునేందుకు ఉద్యోగ సంస్థలు ముందుకొస్తున్నాయని పేర్కొంది. 2025 జనవరి-జూన్‌లో 74 శాతానికి పైగా కంపెనీలు ఫ్రెషర్స్‌ను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని ‘కెరీర్ అవుట్‌లుక్’ నివేదికలో టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ తెలిపింది. దేశ వ్యాప్తంగా 649 యజమాన్య సంస్థలను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించాయి.
ఫ్రెషర్స్‌కే అధిక ప్రాధాన్యం
ముఖ్యంగా ఉద్యోగాలను కంపెనీ నిర్వాహకులు డిగ్రీ పట్టాల ఆధారంగా నియమకాలు చేపట్టడం లేదు. డేటా విజువలైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి రంగాల్లో నైపుణ్యాలున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్ నిర్వాహకుల్లో 70% మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోవాలని యోచిస్తున్నారు. తయారీ రంగంలో 66%, ఇంజినీరింగ్-మౌలిక సదుపాయాల రంగంలో 62% మంది నిర్వాహకులూ ఫ్రెషర్స్‌ను నియమించుకోవాలని చూస్తున్నారు. ఫ్రెషర్లు అధిక ప్రభావవంత ఉద్యోగాల్లోకి అడుగుపెట్టడానికి, పరిశ్రమల్లో ఆవిష్కరణలకు కీలకంగా మారడానికి ఈ మార్పు అద్భుతంగా ఉపయోగ పడుతుందని నివేదిక తెలిపింది.
ఈ నగరాల్లో నియామక అవకాశాలు
రోబో క్ ప్రాసెస్ ఆటోమేషన్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ రిస్క్ అనాలిసిస్‌ను అర్థం చేసుకునే ప్రతిభను కంపెనీలు కోరుకుంటున్నాయి. అవసరమైన టెక్నాలజీ టూల్స్‌లో ప్రొడక్టివిటీ అండ్ కొలాబరేషన్ టూల్స్ (83%), ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ (73%), డేటా విజువలైజేషన్ టూల్స్ (64%)కు యజమానులు ప్రాధాన్యమిస్తున్నారు. బెంగళూరు, ముంబై, చెన్నై నగరాల్లో నియామక అవకాశాలు 78%, 65%, 57శాతంగా ఉన్నాయి.