సంగారెడ్డిలో కల్తీ ఆహారం తిని 11 మంది విద్యార్థినులకు అస్వస్థత

Update: 2025-07-22 09:15 GMT

సంగారెడ్డి జిల్లాలో కల్తీ ఆహారం తిని 11 మంది బాలికలు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో జరిగింది. నిన్న రాత్రి డిన్నర్‌లో భాగంగా పులిహోర తిన్న విద్యార్థినులు కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించి, వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వారి ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై అధికారులు సీరియస్‌గా ఉన్నారు. కల్తీ ఆహారం ఎలా సరఫరా అయింది, నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం జరిగిందా అనే విషయాలపై విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని వసతి గృహాల్లో కల్తీ ఆహారం లేదా కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు నమోదయ్యాయి. దీనిపై ప్రభుత్వం మరింత నిఘా పెట్టాలని, నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News