ACCIDENT: బతుకులు తెల్లారిపోయాయ్
కుటుంబాల్లో విషాదాన్ని నింపిన చేవెళ్ల బస్సు ప్రమాదం
చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో చీకటిని నింపింది. ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చింది. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారు పెడుతున్న కంటతడి అందరి హృదయాలను పిండేస్తోంది. బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ మృతి చెందారు. వారి పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనస్థలిలో నిర్జీవంగా పడివున్న తమ తల్లిదండ్రులను చూసుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘోర ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు రోడ్డు ప్రమాదంలో మరణించారు. తాండూరులోని గాంధీనగర్‌లో నివాసం ఉండే ఎల్లయ్య గౌడ్‌కు ముగ్గురు కుమార్తెలు నందిని, సాయిప్రియ, తనూష ఉన్నారు. వారు హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఇటీవలే బంధువులు పెళ్లి ఉండటంతో సొంతూరికి వచ్చారు. వేడుకలను ముగించుకొని నగరానికి పయనమైన వారిని మృత్యువు కబళించింది.
కోఠి ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్స్ మృతి
ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందినవారిలో ముగ్గురు కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన యువతులు సాయి ప్రియ, నందిని, ముస్కాన్ లు కోఠి మహిళా యూనివర్సిటీ విద్యార్థులని ప్రిన్సిపాల్ లోక పావని తెలిపారు. ఈ ప్రమాదంలో తమ ముగ్గురు విద్యార్థులు మృతి చెందటం బాధాకరమని ప్రిన్సిపాల్ అన్నారు.