హైదరాబాద్ ను వదలని వాన.. మళ్ళీ..

హైదరాబాద్‌ నగరాన్ని వర్షం వదలడం లేదు.. నిన్న ఉదయం నుంచి కాస్త తెరిపినిచ్చిన వాన రాత్రి మళ్లీ మొదలైంది. వాయుగుండం ప్రభావంతో రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్‌లోని..

Update: 2020-10-15 01:08 GMT

హైదరాబాద్‌ నగరాన్ని వర్షం వదలడం లేదు.. నిన్న ఉదయం నుంచి కాస్త తెరిపినిచ్చిన వాన రాత్రి మళ్లీ మొదలైంది. వాయుగుండం ప్రభావంతో రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.. ఇప్పటికే అంధకారంలో ఉన్న ముంపు ప్రాంతాల్లో ఈ వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. పోలీసు, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ విభాగాలు కూడా అప్రమత్తమయ్యాయి.

వరుణడి విలయంతో హైదరాబాద్‌ మహానగరం అతలాకుతలం అయింది. జలమయమైన కాలనీలు, బస్తీల నుంచి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమం రోజంతా సాగింది.. దాదాపు 10 వేల మందిని స్థానిక కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాల్లో ఉంచారు. కొన్ని కాలనీల్లో ముంపు ముప్పు ఉన్నా స్థానికులు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలో అత్యధికంగా బస్తీలు, కాలనీలు ముంపునకు గురయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఈస్ట్, సౌత్‌ జోన్లలో అధికంగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం నగరంలో 1,500 కాలనీలకుపైగా నీట మునిగాయి. వరదనీరు నిన్న మధ్యాహ్నానికి కూడా తగ్గలేదు. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

Tags:    

Similar News