డీలిమిటేషన్ పై రేపు చెన్నైలో అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్

Update: 2025-03-21 11:15 GMT

లోక్ సభ నియోజకవర్గాల పుణర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఆదివారం జరిగే అఖిలపక్ష సమా వేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరవుతున్నారు. శుక్రవారం రాత్రికే సీఎం రేవంత్ చెన్నయ్ బయలుదేరి వెళ్లే అవకాశం ఉందని ఆయన కార్యాలయ అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఇందుకు నిరసనగా పార్టీలకతీతంగా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకు దక్షిణాదిలోని అన్ని పార్టీలను ఏకం చేయాలని ఆయన సంకల్పించారు. నియోజక వర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కూడా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో నియోజకవర్గాల పునర్విభజనపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇందులో సభ్యులుగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాష్ట్రంలో అన్ని పార్టీలను ఏకం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కమిటీకి కట్టబెట్టారు.

మూడు రోజుల క్రితం శాసనసభ ఆవరణలోని కమిటీ హాల్లో ఈ కమిటీ నిర్వహించిన తొలి సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీలు గైర్హాజరయ్యాయి. కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఐ(ఎం) మాత్రమే హాజరయ్యాయి. డీలిమిటేషన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై పగబట్టి కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణాలో ఉన్న 17 లోక్సభ స్థానాలను కుదించే ప్రయత్నం చేస్తోందని దీన్ని అడ్డుకుని పోరాడే సమయం ఆసన్నమైందని అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి, జానా రెడ్డి పిలుపు నిచ్చారు. కాగా శనివారం డీఎంకే ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ పక్షాన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరవుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News