ANNAMAYA: అన్నమయ్య జిల్లా రద్దు.. !
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మలుపు... అన్నమయ్య జిల్లా రద్దుపై చర్చ... 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య
అన్నమయ్య జిల్లాను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. విభజిత జిల్లాలో మిగిలిన రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాలను మూడు జిల్లాల్లో కలపాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టత ఇచ్చింది. వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు చెరుకూరి శ్రీధర్, నిశాంత్ కుమార్లను అమరావతికి ఆదివారం పిలిపించారు. తుది ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా సోమవారం కూడా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు ఇద్దరు కలెక్టర్లు అమరావతిలోనే మకాం వేశారు.
ప్రజల నుంచి వస్తున్న వినతులు, నిరసనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్న ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను రద్దుల పద్దులోకి తీసుకురావాలనుకుంటోంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో అన్నమయ్య జిల్లాపై సుదీర్ఘ చర్చ జరిపారు. . ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య జిల్లాను ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 4 నియోజకవర్గాలలోని 19 మండలాలతో మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత అన్నమయ్య జిల్లా కేవలం మూడు నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా మిగిలిపోనుంది. చిన్న జిల్లాల వల్ల ఇప్పటికే తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, అన్నమయ్య జిల్లాను ప్రత్యేక జిల్లాగా కొనసాగించలేని పరిస్థితిపై చంద్రబాబుకి అధికారులు వివరించారు. రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో, రాజంపేటను వైఎస్సార్ కడపలో, రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేయనున్న మదనపల్లె జిల్లాలో విలీనం చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులు ప్రతిపాదించారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న విన్నపాలు, అభ్యంతరాలు, నిరసనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అన్నమయ్య జిల్లాను రద్దు చేసి, దానిలోని మండలాలు, డివిజన్లను తిరుపతి, కడపతో పాటు కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాలో విలీనం చేయాలని యోచిస్తున్నారు. దీనిపై ఆదివారం మరోసారి సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత సోమవారం జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీన్ని ఆమోదానికి పంపించనున్నారు. అన్నమయ్య జిల్లాను జాబితా నుంచి తొలగిస్తే, కొత్తగా ఏర్పడే మూడు జిల్లాలతో కలిపి మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరుతుంది. ఈ నిర్ణయాలను 29న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి, 31న తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు.