బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద రాజా సింగ్ మాట్లాడి.. ఎన్నికల నియమావళి ఉల్లఘించినట్లు ఎస్‌ఐ మధుసుధన్ తన ఫిర్యాదులో తెలిపారు.
శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో హనుమాన్ వ్యాయామశాల వద్ద ఎస్సై మధుసూదన్ విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత హనుమాన్ వ్యాయామశాల వద్దకు చేరుకున్న రాజా సింగ్ అక్కడ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది.
సుల్తాన్ బజార్ పోలీసులు రాజాసింగ్ పై ఐపీసీ 188, 290 రెడ్ విత్ 34, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 కింద కేసు నమోదు చేశారు. రాజాసింగ్ పెద్ద ఎత్తున శబ్ధాలతో స్థానికులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రసంగం చేశారని అభియోగాలు నమోదుచేశారు. నిబంధనలు ఉల్లఘించిన రాజాసింగ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐ మధుసూదన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.