Heavy Rain : తెలంగాణకు మరో భారీ వర్ష సూచన: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం
గతంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఆ వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు పండగ పూట వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో రాగల 48 గంటల పాటు తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ లోని నాగర్ కర్నూల్, నల్గొండ, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో రాత్రి సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.