దేశంలోని పలు రాష్ట్రాల్లో, పొరుగున ఉన్న ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాధి కేసులు నమోదవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఒక దశలో బర్డ్ ఫ్లూ జంతువుల కోళ్ల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో చికెన్ తినే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశుసంవర్థకశాఖ సూచిస్తోంది. గ్రిల్డ్ చికెన్, ఉడికీ ఉడకని చికెన్, గుడ్లను అసలు తినొద్దని హెచ్చరిస్తోంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రా లను అప్రమత్తం చేసింది.అదే సమయంలో ఏపీలో బర్డ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ అంతుచిక్కని వ్యాధితో పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫారా ల్లోని కోళ్లు చనిపోతుండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు కోళ్ల వాహనం కాదు కదా ఒక్క కోడిని కూడా రానివ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.