Pawan Kalyan : రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్
కొండగట్టు ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకోనున్న పవన్..;
రేపు (శనివారం) కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తన మొక్కులను తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా జనసేన అధినేత భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు.. ఆ వాహనానికి తొలిపూజ కూడా కొండగట్టులోనే పవన్ కళ్యాణ్ నిర్వహించారు
అలాగే, ఎన్డీయే కూటమి పొత్తులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం. ఇవాళ మధ్యాహ్నం పవన్ సెక్యూరిటీ అధికారులు కొండగట్టుకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్ మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు చేరుకుంటారు. జేఎన్టీయూలో హెలీప్యాడ్ అందుబాటులో లేకపోవడంతో.. పవన్ సెక్యూరిటీ స్పెషల్ అడ్వైజర్ కల్నల్ అర్జున్ రూట్ మ్యాప్, పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కల్యాణ్.. శనివారం ఉదయం 7 గంటలకు మాదాపూర్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఆయన చేరుకోనున్నారు. గంటన్నర పాటు కొండగట్టు పుణ్యక్షేత్రంలో పవన్ గడపనున్నారు. ఆంజనేయస్వామికి పవన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కొండగట్టు నుంచి మాదాపూర్‌కు రోడ్డు మార్గంలో తిరిగి రానున్నారు. సాయంత్రం 4.30కు మాదాపూర్ చేరుకోనున్నారు. శనివారం రాత్రికి హైదరాబాద్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ బస చేయనున్నారు.
పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడంతో పవన్ కల్యాణ్ జూన్ 26న వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. 11 రోజుల పాటు నిష్టగా ఈ దీక్షను పవన్ కల్యాణ్ పాటించనున్నారు. పసుపు రంగు దుస్తుల్లో ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఉన్న పవన్ కల్యాణ్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ దీక్ష దుస్తుల్లో ఉన్న పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని కనిపించడం చర్చనీయాంశంగా మారింది.