కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు అడవికి వెళ్లిన భార్యాభర్తలపై ఎలుగుబంటి దాడి చేయడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన గురువారం సిర్పూర్ (టి) మండలం, అచ్చెల్లి గ్రామంలో జరిగింది.
గ్రామానికి చెందిన దూలం శేఖర్ (45), ఆయన భార్య సుశీల (38) పశువుల కాపర్లుగా జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే గురువారం కూడా తమ పశువులను మేపేందుకు సమీపంలోని పెద్దబండ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అయితే సాయంత్రం పశువులు ఇంటికి తిరిగివచ్చినా శేఖర్ దంపతులు రాలేదు. దీంతో ఆందోళనకు గురైన వారి పిల్లలు వెంటనే బంధువులకు విషయం తెలియజేశారు.
బంధువులు శేఖర్‌కు ఫోన్ చేయగా ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సీఐ సంతోష్, ఎస్సై సురేశ్ బృందాలు గ్రామస్థులతో కలిసి అడవిలో గాలింపు చేపట్టారు. రాత్రి 12 గంటల సమయంలో సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అక్కడికి చేరుకోగా, శేఖర్, సుశీల విగతజీవులుగా పడి ఉండటం కనిపించింది. వారి మృతదేహాలను సిర్పూర్(టి) ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
పరిహారం హామీ శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదోద్దీన్, డీఎఫ్‌వో సుశాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాల శరీరాలపై ఉన్న గాయాలను బట్టి ఇది ఎలుగుబంటి దాడి అని నిర్ధారించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ దండె విఠల్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబానికి ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఎఫ్‌డీవో సుశాంత్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 20 లక్షల పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన అచ్చెల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.