Bandi Sanjay : నేటితో ముగియనున్న బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర..
Bandi Sanjay : వరంగల్ బీజేపీ సభకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి;
Bandi Sanjay : వరంగల్ బీజేపీ సభకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. అసలు సభకు పర్మిషన్ ఉంటుందా ఉండదా అనే ఉత్కంఠ మధ్య హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో సభ ఏర్పాట్లను పూర్తి చేశారు బీజేపీ నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను హన్మకొండలో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.
బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆటంకాలు, అవరోధాల మధ్య సాగింది. ఇవాళ భద్రకాళీ అమ్మవారి దర్శనంతో పాదయాత్ర ముగియనున్నది. పోలీసు కేసులు, కోర్టు చిక్కులు దాటుకుని ముగింపు సభకు సిద్ధమైంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీజేపీ సభను సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. భారీగా జనసమీకరణ చేసి తమ సత్తా ఎంటో చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభకు జనసమీకరణ కోసం ఆరు జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. జనసమీకరణపై ఎంపీ లక్ష్మణ్ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు.
ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకుబీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా రానున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు సతీసమేతంగా రానున్న నడ్డా..శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. హోటల్‌లోనే మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌తో సమావేశం అవుతారు. అనంతరం జేపీ నడ్డా శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరుతారు.
ముందుగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభ అనంతరం జేపీ నడ్డా... సాయంత్రం ఆరుగంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. నోవాటెల్‌లోనే సినీ నటుడు నితిన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు. నడ్డా మిథాలీరాజ్, నితిన్‌తో సమావేశం కానుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.