Telangana : సర్పంచ్ ఎన్నికల్లో బీసీ పంచాయితీ..!

Update: 2025-11-27 13:37 GMT

తెలంగాణలో ఎన్నో వాయిదాల తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయని గ్రామాల్లో సందడి నెలకొంది. కానీ బీసీ సంఘాలు మాత్రం తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ దేవుడెరుగు.. కనీసం గత ఎన్నికల్లో ఉన్న పాత రిజర్వేషన్ కూడా లేదు అంటూ మండిపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 24% బీసీలకు రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు 17 శాతానికి తగ్గించారు అంటూ నిన్న గాంధీభవన్ ను బీసీ సంఘాలు ముట్టడించాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని లేకపోతే సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి బీసీ సంఘాలు. దీంతో ఈ అంశం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారింది. ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు 21.39 ఉన్నాయని గత ఎన్నికలతో పోలిస్తే 1.5% మాత్రమే తగ్గాయని చెబుతోంది.

దీనికి అనేక కారణాలను చూపిస్తోంది ప్రభుత్వం. కొన్ని జిల్లాల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు ఎక్కువగా వెళ్లడం, బీసీల రిజర్వేషన్లు ఉన్న గ్రామాలు మున్సిపాలిటీలో కలవడం వల్ల రిజర్వేషన్లు కొంతమేర తగ్గినట్టు చెబుతోంది. అంతకుమించి ప్రభుత్వం ఏమీ తగ్గించలేదని వివరణ ఇచ్చింది. అయినా సరే బీసీ సంఘాలు మాత్రం ఒప్పుకోవట్లేదు. తమకు అన్యాయం జరిగితే చట్టపరంగా పోరాడుతామని.. ప్రతిపక్షాలు తమతో కలిసి రావాలి అంటూ పిలుపునిస్తున్నాయి. దీంతో సర్పంచ్ ఎన్నికలకు మధ్యలోనే అవాంతరాలు ఎదురవుతాయా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ పరంగాను రిజర్వేషన్లు తగ్గాయి. అందుకే బీసీ సంఘాల నిరసనలు ప్రభుత్వానికి అడ్డంకిగా మారుతున్నాయి.

అటు బిఆర్ఎస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. బీసీలకు తమ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రేవంత్ ప్రభుత్వం తగ్గించింది అంటూ ప్రచారం చేస్తోంది. ఈ రకమైన నిరసనలు, ప్రచారాలు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఎఫెక్ట్ చూపిస్తాయా అనే అనుమానాలు హస్తం పార్టీలో కలుగుతున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్లపై ఆ సంఘాల నేతలు కోర్టులకు వెళితే మళ్ళీ న్యాయపరంగా చిక్కులు రావడం ఖాయం. మరి ఈ అడ్డంకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా క్లియర్ చేసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News