రాష్ట్రంలో బీర్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెంచిన బీర్ల ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం ప్రస్తుతం బీర్ల ఎమ్మార్పీ ధరలపై 15 శాంతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే బీర్లతో పాటు ఇతర మద్యం ధరలపై పలు రాష్ట్రాల్లో త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసింది.
రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచేందుకు తిసభ్య కమిటీ సిఫార్సును అబ్కారీ శాఖ నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసింది. ముఖ్యంగా బ్రాండెడ్ బీర్లు, బ్రాండెడ్ మద్యం, చీప్ లిక్కర్ ధరలు పెంచాలని త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి మద్యం ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. త్రిసభ్య కమిటీ కూడా 15 నుంచి 19 శాతం పెంచేందుకు నివేదిక ఇవ్వగా 15 శాతం బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒక్క బీర్ల పెట్టె మీద 15 శాతం బేసిక్ ధర పెంచితే, దానికి కనీసం రూ.250 నుంచి రూ. 280 వరకు వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో పాటు వివిధ రకాల పన్నులు జత కలుస్తాయి. దీంతో రూ.150 ఉన్న లైట్ బీర్ రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరిగాయి. కొత్త రేట్లతో ప్రభుత్వానికి నెలకు రూ. 500 కోట్ల నుంచి రూ. 700 మేరకు అదనపు ఆదాయం కూరే అవకాశం ఉందని అబ్కారి శాఖ అధికారులు చెబుతున్నారు.