TG: భూ భారతి శకం ఆరంభం
భూ భారతి పోర్టల్ ఆరంభించిన రేవంత్‌రెడ్డి... భూధార్ తెస్తామని ప్రకటించిన సీఎం;
భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా.. భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న తపనతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ పోర్టల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో ఈ పోర్టల్‌ను అమలు చేయనున్నారు. మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి), వెంకటాపూర్ (ములుగు), నేలకొండపల్లి (ఖమ్మం) మండలాలను ఎంపిక చేశారు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
భూధార్ తెస్తాం
భూ భారతి పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పజెప్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మనిషికి ఆధార్ ఎట్లనో.. ప్రతి ఒక్కరి భూమికీ భూధార్ తెస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి, హద్దులు గీసి రైతుల సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించడం పెద్ద సమస్య కాదని, రాబోయే రోజుల్లో వివాదరహిత భూ విధానం ఉండేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
వేల ఎకరాల కబ్జా
ఈ క్రమంలో చట్టాలను కొంతమందికి చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టిన మాట వాస్తవం కదా”అని ఆయన ప్రశ్నించారు. “నాలుగైదు దశాబ్దాలుగా రెవెన్యూ సిబ్బంది భూముల వివరాలను భద్రంగా నమోదు చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ, వీఆర్వో, వీఆర్ఏల వరకు రికార్డులను అందుబాటులో ఉంచారు. కానీ.. ధరణి తెచ్చి రెవెన్యూ సిబ్బందిని దోషులుగా, దొంగలుగా కొందరు చిత్రీకరించారు. అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
దానికి వ్యతిరేకం
తాము చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి తాను వ్యతిరేకమని రేవంత్ వెల్లడించారు. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దామని తెలిపారు. కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ఈ వేదికగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి’ అని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.