Telangana : కారు బోరుకెళ్ళింది
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘోర పరాజయం;
లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ విజయం సాధించని భారత రాష్ట్ర సమితి... దారుణ ఓటమిని చవిచూసింది. పార్టీ చరిత్రలోనే ఘోర పరాజయంతో..... లోక్‌సభలో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. 2004 ఎన్నికలు మొదలుకొంటే.. లోక్‌సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. 2004 లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన తెరాస... ఐదు స్థానాలను గెలుచుకుంది. 2009లో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి.. కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా 11 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో రెండో మారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు. తాజాఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు మాత్రమే గెలుచుకుని అధికారాన్ని కోల్పోయిన భారాస... ఈ ఎన్నికల్లో అంత కంటే ఘోర పరాజయాన్ని చవిచూసి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. మొత్తం 17 స్థానాలకుగాను ఏకంగా ఎనిమిది స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ధరావత్తు కూడా కోల్పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, జహీరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో భారాస అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఇందులో మూడు స్థానాలు చేవెళ్ల, మహబూబ్‌నగర్, జహీరాబాద్ స్థానాలు .. భారాసకు సిట్టింగ్ సీట్లు. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో.. భారాస ఎమ్మెల్యేలే గెలిచారు. అయినప్పటికీ.. అక్కడ భారాస మూడో స్థానానికే పరిమితమైంది. లాస్య నందిత మరణంతో వచ్చిన కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ భారాస పరాజయం పాలైంది.
మెదక్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని భారాస ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నారు. ఐనా.. ఈ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో... భారాస ఎంపీ అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితమయ్యారు. గులాబీకి కంచుకోటగా చెప్పుకునే కరీంనగర్‌తోపాటు.. పెద్దపల్లి, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్ స్థానాల్లోనూ... భారాస అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితమయ్యారు. కేవలం ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే.. భారాస అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. ఆ రెండు చోట్ల కూడా.. పార్టీ సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
ఓట్ల పరంగా చూస్తే 2018 శాసనసభ అత్యధిక శాతాన్ని అందుకొన్న భారాస.. క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతంతో... 97 లక్షల 948 ఓట్లను సాధించింది. ఆ వెంటనే జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో 41.29 శాతానికే పరిమితమై.. 76 లక్షల 96 వేల 848 ఓట్లతోనే సరిపెట్టుకుంది. ఇటీవల జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37.35 శాతానికి భారాస ఓట్ల శాతం పడిపోయింది. ఆ ఎన్నికల్లో.. పార్టీకి 87 లక్షల 53 వేల 924 ఓట్లు లభించాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో... గులాబీ పార్టీ ఓట్ల శాతం... గతంలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి పడిపోయింది. కేవలం 16.68 శాతం మాత్రమే సాధించి.... 36 లక్షల 37 వేల 86 ఓట్లకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఏకంగా 51 లక్షలకు పైగా ఓట్లను భారాస నష్టపోయింది. కేవలం ఆరు నెలల్లోనే... 21 శాతానికిపైగా ఓట్లు కోల్పోయింది..