BRS Party: ఎవరికీ భయపడం.. రంగంలోకి దిగిన కేటీఆర్..

ఇక వరుసగా సమావేశాలు..

Update: 2024-01-04 02:30 GMT

లోటుపాట్లు సవరించుకొని తగిన కార్యాచరణతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంకానున్నట్లు బీఆర్ఎస్‌ తెలిపింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని...హామీల అమలులో ఆలస్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు స్పష్టంచేసింది. కాంగ్రెస్, భాజపాకి తెలంగాణ ప్రయోజనాలు పట్టవని... రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా మద్దతివ్వాలని విజ్ఞప్తిచేసింది. నేతలు, శ్రేణుల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థిత్వాల ఎంపిక ఉంటుందని బీఆర్ఎస్‌ తెలిపింది . 

శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన భారాస లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకునే కార్యాచరణపై దృష్టిపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలకు శ్రీకారంచుట్టింది. తొలుత ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలతో తెలంగాణభవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్‌రావు తదితరులు సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమికారణాలు, అభిప్రాయాలని నేతల నుంచి తీసుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతాడని ప్రజలు భావించలేదని నేతలు తెలిపారు.

ఓటమికి కుంగిపోవాల్సిన అవసరంలేదని కలసికట్టుగా పోరాడితే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని పార్టీ సీనియర్ నేతలు కేశవరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియంశ్రీహరి సూచించారు. అభివృద్ధి, సంక్షేమపరంగా కేసీఆర్ సర్కారు ఎలాంటి లోటుచేయకపోయినా ఎందుకు ఓటమిపాలయ్యామో విశ్లేషించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బలమైనప్రతిపక్షంగా భారాస ఉందని పార్టీకి గెలుపు, ఓటములు కొత్తకాదన్న హరీశ్‌రావు...2008, 2009 ఎన్నికల్లో ఆశించినఫలితాలు రానప్పటికీ తిరిగి పుంజుకున్న విషయాన్ని గుర్తుచేశారు. నేతలు, శ్రేణులు ఐక్యంగా పోరాడితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకతవచ్చిందని, ఆ అనుకూలంగా మలుచుకొని ముందుకెళ్లాలని నేతలకు హరీష్ రావు సూచించారు.

కృతిమసానుకూలతని సృష్టించుకొని కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్న KTR..నేతల అభిప్రాయాన్ని అధినేతదృష్టికి తీసుకెళ్తామని... అవసరమైన మేరకు సవరణలు చేస్తామని, లోటుపాట్లు సరిదిద్దుతామని తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. వందరోజుల్లో గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొంద పెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్, భాజపా నేతలు దిల్లీ నాయకత్వం కింద పనిచేసే వారని... ఆ రెండు పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ భారాస మాత్రమేనని గుర్తుచేశారు. తెలంగాణ గళం, దళం, బలంగా కేసీఆర్ దండుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Tags:    

Similar News