BRS Manifesto: వరాలతో దూసుకురానున్న కారు

నేడు మ్యానిఫెస్టో విడుదల చేయనున్న పార్టీ అధినేత కేసీఆర్‌

Update: 2023-10-15 02:45 GMT

భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టో నేడు విడుదల కానుంది. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు.  తెలంగాణ భవన్‌లో అభ్యర్థులతో సమావేశమై వారికి బీఫారాలు ఇవ్వనున్నారు. తర్వాత మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అయిదుగురు అభ్యర్థులతో తుది జాబితాను కూడా నేడు ప్రకటించనున్నారు. 

ఎన్నికల బరిలో బీఆర్‌ఎస్‌ నేడు కీలక అడుగు వేయనుంది. ఎన్నికల మేనిఫెస్టోను భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ప్రకటించనున్నారు. మేనిఫెస్టోపై  కొంతకాలంగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇతర పార్టీలు ఇస్తున్న హామీలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు వివిధ సర్వేల ఆధారంగా మేనిఫెస్టో సిద్ధం చేశారు. ఇప్పటికే అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి వంటి పథకాల ఆర్థికసాయాన్ని మరింత పెంచనున్నట్లు హామి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మహిళలను ఆకర్షించేందుకు రెండు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు రైతులకు ఫించన్లు, ఉచితంగా ఎరువులను మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అలాగే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను భారాస ప్రకటించింది. మల్కాజిగిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. మల్కాజిగిరితో పాటు గతంలో ప్రకటించని జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థులకు కూడా ఇవాళ బీఫారాలు ఇవ్వనున్నారు. మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. అయితే గతంలో ప్రకటించిన  114 మంది అభ్యర్థుల్లో ఇద్దరు, ముగ్గురిని మార్చవచ్చునని ప్రచారం జరుగుతోంది. బీఫారాలు పంపిణీతో పాటు ఎన్నికలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మేనిఫెస్టోను వివరించాలని చెప్పనున్నారు. కాంగ్రెస్, భాజపా ప్రచారాన్ని.. ఎలా తిప్పికొట్టాలో కూడా అభ్యర్థులకు  కేసీఆర్ తెలపనున్నారు. నామినేషన్, అఫిడవిట్ల దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు భారాస నేతలు వివరించనున్నారు.

గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రచార శంఖారావం మోగించనున్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా. హుస్నాబాద్‌లో తొలి ప్రచార సభ నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ, మేనిఫెస్టో విడుదల తర్వాత హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ వెళ్లి సాయంత్రం 5 గంటలకు అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నేటి నుంచి నవంబరు 9 వరకు 41 సభల్లో ప్రసంగించనున్నారు. హెలికాప్టర్ ద్వారా రోజూ రెండు, మూడు సభల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

Similar News