Rajya Sabha : బనకచర్ల పై చర్చించండి.. రాజ్యసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దెబ్బ తీస్తుందని ఆరోపించారు రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి. తెలంగాణకు జీవనాధారం అయిన గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్లపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ వేదికగా పోరాటానికి సిద్ధం అయింది బీఆర్ఎస్ పార్టీ. గోదావరి నదీ జలాల అంశం, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని కోరుతూ రాజ్యసభలో వాయిదా తీర్మానం అందజేశారు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి. కనీస అనుమతులు లేకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని అందులో పేర్కొన్నారు. సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుంటున్నామని ఏపీ చెబుతోందని.. అసలు రెండు రాష్ట్రాల వాటా ఎంతో తేలాలని అన్నారు. ఆ తర్వాతే మిగులు జలాలపై చర్చ జరగాలన్నారు. గోదావరి నీటిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు జలశక్తి క్లారిటీ ఇవ్వాలని సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.