BYPOLL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి
వేగంగా మారుతున్న పార్టీల సమీకరణాలు... టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందన్న వార్తలు;
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాజకీయ వేడి రాజేస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో హైదరాబాద్లో బై పోల్ అనివార్యంగా మారింది. ఆర్నెళ్లలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా... రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ స్థానాన్ని గెలిచి హైదరాబాద్ లో తమ సత్తా నిరూపించుకోవాలని బీఆర్ఎస్... కంటోన్మెంట్ గెలిచినట్లే ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్లో పాగా వేయాలని బీజేపీ, ఎంఐఎం కూడా బాగానే ప్రయత్నిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ... ఏపీలో అధికారంలో ఉన్న కూటమి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొత్త మలుపు తిప్పనుందన్నా వాదన వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఈ ఎన్నిక పూర్తిగా మార్చేస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది.
వ్యూహాలకు, ఊహాగానాలకు వేదిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వ్యూహాలకు, ఊహాగానాలకు వేదికగా మారింది. ఇప్పటికే ఉప ఎన్నికల విషయంలో కొత్త పొత్తులు పొడిచే అవకాశం ఉందన్న ఊహాగానాలు మాత్రం బలంగానే వినిపిస్తోంది. అయితే ఈ ఊహాగానాలను పూర్తిగా కొట్టివేసే పరిస్థితి లేదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత దృష్టా, తెలంగాణలోనే కాకుండా,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ జూబ్లీ ఉప ఎన్నిక గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నియోజక వర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే,అందులో చాలా మంది సెటిలర్స్ ఉన్నారు. ఈ ఓట్లు ఎవరిపరమైతే వారి గెలుపు తథ్యమన్న భావన చాలామందిలో ఉంది. ఎంఐఎం కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ లక్షా 20 వేల వరకు ముస్లిం, మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపులో కీలక పాత్ర పోషించనున్నాయి. అయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెటిలర్స్ ఓట్లే చాల కీలకమన్నది కాదనలేని వాస్తవం. జూబ్లీహిల్స్ నియోజకర్గంపై కాంగ్రెస్ లెక్కలు మరోలా ఉన్నాయి. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ కీలకమైన నియోజకవర్గం కావడంతో ఈసారి హస్తం జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
2014లో గెలిచింది టీడీపీనే
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ తొలి శాసన సభ ఎన్నికల్లోనూ జూబ్లీ నియోజక వర్గం నుంచి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాగంటి గోపీనాథ్’ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్’లో చేరినా, వరసగా 2018, 2023 ఎన్నికల్లో ఆయన్ని గెలిపించింది మాత్రం సెట్లర్స్’ ఓట్లే. ఈ నేపథ్యంలో, తెలంగాణలో రీ-ఎంట్రీకి ప్రయత్నిస్తునట్లు చెపుతున్న, తెలుగు దేశం పార్టీ, జూబ్లీ ఉప ఎన్నికను లాంచింగ్ ప్యాడ్’ చేసుకుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి ఇప్పటికీ గట్టి పట్టుంది. రాష్ట్ర విభజన తర్వతా జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ 20 అసెంబ్లీ స్థానాలు గెలుచు కుంది. 2018లో టీడీపీ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రం టీడీపీ తెలంగాణలో పోటీచేయలేదు. అయితే,ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ తెలంగాణలో తిరిగి కాలు మోపేందుకు సిద్డమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఆంధ్ర ప్రదేశ్’ లో సక్సెస్ అయిన, టీడీపీ. జనసేన, బీజేపీ కూటమి ఫార్ములాను తెలంగాణాలో కొనసాగించాలని కూటమి నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జూబ్లీ ఉప ఎన్ని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేస్తుందని అంటున్నారు. అయితే, కూటమి తరపున, ఏపార్టీ పోటీ చేయాలి, అభ్యర్థి ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు.