ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని రాముడి చిత్రాలతో పాటు ఎమ్మెల్యే శంకర్ చిత్రం ఉన్న ఫ్లెక్సీలను ఏర్పా టు చేశారని, వీటికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోలేదని ఫ్లయింగ్ స్క్వాడ్ వారు ఫిర్యాదు చేసినట్లు ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఈ నెల 17న శ్రీరామ నవమిని పురస్కరించుకుని పాత మంచిర్యాలలోని రామాలయాన్ని సందర్శించి సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం ఆ ఆలయానికి లక్ష రూపాయల నగదు విరాళంగా అందించారు. ఈ విషయం అన్ని పత్రికల్లో రావడంతో ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా విరాళం ఇచ్చినందుకు కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైనట్లు ఆర్డీవో వడాల రాములు తెలిపారు.