Telangana: 45 రోజుల ఉత్కంఠకు తెర.. తెలంగాణ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..
Telangana: తెలంగాణలో తక్షణమే బియ్యం కొనుగోలు ప్రారంభించాలని FCIకి ఆదేశాలు జారీ చేసింది.;
Telangana: 45 రోజుల ఉత్కంఠ, వివాదానికి తెర పడింది. తెలంగాణలో తక్షణమే బియ్యం కొనుగోలు ప్రారంభించాలని FCIకి ఆదేశాలు జారీ చేసింది. ఒప్పందం మేరకు ముడిబియ్యాన్ని తీసుకోనుంది. ఈమేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బుధవారం ఈప్రకటన చేశారు. తెలంగాణ నుంచి బియ్యం ప్రొక్యూర్మెంట్ చేయాలని భారత ఆహార సంస్థకు ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. గోయల్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే హైదరాబాద్ రీజియన్ ఎఫ్‌సీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్...ఉత్తర్వులు జారీచేశారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని, ధాన్యం మాయం చేసిన రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బియ్యం సేకరణ పునఃప్రారంభిస్తున్నట్లు ఏజీఎం వెల్లడించారు. ఇక కేంద్రం నిర్ణయంతో రగడకు ఫుల్ స్టాప్ పడ్డట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి, రైస్‌మిల్లర్లకు భారీ ఊరట కలిగింది. 45 రోజులుగా రైస్‌మిల్లుల్లో ముక్కిపోతున్న 22వేల కోట్ల రూపాయల విలువైన ధాన్యం సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.
గత యాసంగి సీజన్‌కు వచ్చేసరికి 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేశారు. సాధారణంగా రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఉప్పుడు బియ్యం ఉత్పత్తి చేస్తారు. కానీ, కేంద్రం అందుకు అంగీకరించకపోవటంతో 67 శాతం లెక్క ప్రకారం ముడి బియ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అంటే..యాసంగికి సంబంధించి 33.95 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. మొత్తం కలిపి 63.92 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ రైస్‌మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 45 రోజులుగా బియ్యం సేకరణ నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వడ్ల నిల్వలు పేరుకుపోయాయి.
ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవడంతో..ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనలో భాగంగా కేంద్రం నుంచి 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లిఫ్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని పేదలకు 5 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేయలేదు. ఏప్రిల్, మే నెలల కోటాను పేదలకు ఇవ్వకపోవడాన్ని కేంద్రం సీరియ్‌సగా తీసుకొంది. దీంతోపాటు గత మార్చిలో రైస్‌మిల్లుల్లో భౌతిక తనిఖీలు నిర్వహించిన ఎఫ్‌సీఐ.. 40 రైస్ మిల్లుల్లో 4లక్షల 53వేల 896 ధాన్యం బస్తాలు మాయం అయ్యాయని, సంబంధిత రైస్‌మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఆతర్వాత మే నెలలో మరోసారి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించింది. మొత్తం 63 మిల్లుల్లో రెండు సీజన్లకు సంబంధించిన లక్షా37వేల బస్తాల ధాన్యం షార్టేజీ ఉందని, ఆ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. అలాగే, 593 మిల్లుల్లో సీజన్ల వారీగా ధాన్యం బస్తాలను లెక్కించడానికి వీలు లేకుండా ఉందని, వాటిని క్రమ పద్ధతిలో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు ఎఫ్‌సీఐ లేఖ రాసింది. అయితే, రైస్‌మిల్లర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉండడంతో కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది.
రాష్ట్రంలో బియ్యం సేకరణను గతనెల ఏడో తేదీ నుంచి నిలిపివేసింది. దీంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. జూన్ చివరి వారంలో 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేసింది. అదేక్రమంలో ఏడుగురు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. బియ్యం సేకరణకు అనుమతివ్వటానికి ముందు రాజకీయం తారాస్థాయికి చేరింది. తెలంగాణ నుంచి బియ్యం సేకణను నిలిపివేయటానికి గల కారణాలను వివరిస్తూ కేంద్రం ఒక నోట్ విడుదల చేసింది. డిఫాల్టర్లుగా మారిన రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, PMGKAY కింద ఉచిత బియ్యం పేదలకు పంపిణీ చేయలేదని పేర్కొంది.
అందుకే తెలంగాణ నుంచి బియ్యం సేకరణ నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. ధాన్యం షార్టేజ్‌కు కారకులైన రైస్‌మిల్లర్లపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. అయితే, సాయంత్రంలోగానే ఢిల్లీలో పరిణామాలు చకచకా మారిపోయాయి. తెలంగాణ రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు మంగళవారమే ఢిల్లీకి చేరుకొని లాబీయింగ్ నడిపారు. బీజేపీ ఎంపీలను కలిసి సీఎంఆర్ సేకరణకు అనుమతి ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌ను కలిశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కిషన్‌రెడ్డి, ఎంపీలు చర్చలు జరిపి సీఎంఆర్ సేకరణకు ఉత్తర్వులు ఇచ్చేలా ఒప్పించారు. దీంతో కథ సుఖాంతమైంది.