CHEVELLA ACCIDENT: అయ్యో... దేవుడా..
కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన చేవెళ్ల ప్రమాదం
చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో చీకటిని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక హృదయ విదారక దృశ్యం అందరినీ కలచివేసింది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పడుకున్న చిన్నారి ప్రమాదంలో తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలింది. తల్లీబిడ్డ రోడ్డుపై మృతి చెందిన దృశ్యాలు గుండెను పిండేశాయి. ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డుపై విగత జీవులుగా పక్కపక్కనే పడిఉన్న తల్లీబిడ్డల ఫొటో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. మృతుల్లో 15 నెలల చిన్నారి, ఆమె తల్లి కూడా ఉన్నారు. తల్లి తన ఒడిలో పాపను పట్టుకొని ఉండగానే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కంకరలో కూరుకుపోయిన ఆ తల్లీబిడ్డల మృతదేహాలను చూసిన స్థానికులు, తోటి ప్రయాణికులు కన్నీరు మున్నీరయ్యారు. అయ్యో దేవుడా.. ఏంటయ్యా ఈ ఘోరం అంటూ గుండెలు బాదుకున్నారు. చిన్నారిని కంకర కుప్ప నుంచి బయటకు తీసే దృశ్యాలను చూసి మనోవేదనకు గురయ్యారు.
విద్యార్థులే ఎక్కువ
తాండూరు నుంచి హైదరాబాద్‌లోని కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులే ఈ బస్సులో ఎక్కువగా ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, విపత్తు సహాయక బృందాలు జేసీబీ సాయంతో కంకరను తొలగించి, సహాయక చర్యల చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కుప్పలుగా పడి ఉన్న మృతదేహాల చూసి వారి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కంకర ట్రక్కు మృత్యు శకటంలా దూసుకొచ్చి.. అమాయకుల ప్రాణాలను బలిగొనడం తీవ్ర విషాదాన్ని నింపింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకునే లోపే ఈ ఘోర ప్రమాదం ఇరవై మందిని పొట్టన పెట్టుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు కంకర ట్రక్కు డ్రైవర్ కూడా మరణించాడు. ఈ ప్రమాద దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి.
ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారు పెడుతున్న కంటతడి అందరి హృదయాలను పిండేస్తోంది. బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ మృతి చెందారు. వారి పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనస్థలిలో నిర్జీవంగా పడివున్న తమ తల్లిదండ్రులను చూసుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘోర ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు రోడ్డు ప్రమాదంలో మరణించారు. తాండూరులోని గాంధీనగర్‌లో నివాసం ఉండే ఎల్లయ్య గౌడ్‌కు ముగ్గురు కుమార్తెలు నందిని, సాయిప్రియ, తనూష ఉన్నారు. వారు హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఇటీవలే బంధువులు పెళ్లి ఉండటంతో సొంతూరికి వచ్చారు. వేడుకలను ముగించుకొని నగరానికి పయనమైన వారిని మృత్యువు కబళించింది.