సీపీఐ అగ్ర నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సురవరం సుధాకర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేత గా ఎదిగారని, వామ పక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు గొప్ప నాయకుడని కొనియాడారు. దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని ముఖ్యమంత్రి తన బాధను వ్యక్తం చేశారు.
ఆదివారం అంతిమ యాత్ర
సురవరం పెద్దకుమారుడు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో ఆయన అంతిమయాత్రను ఆదివారం నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం పదిగంటలకు ప్రజల సందర్శనార్థం సురవరం భౌతికకాయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యాలయమైన మగ్ధూంభవన్‌కు ఉదయం 10 గంటలకు తరలించనున్నారు. మధ్యాహ్నం అంతిమ యాత్ర నిర్వహించి సాయంత్రం సురవరం సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం గాంధీ బోధానాసుపత్రికి అప్పగించనున్నారు.