తమ ప్రజాపాలనలో 10 నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. ‘నేను సవాల్ చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలోకానీ, ప్రధాని మోదీ సీఎంగా పనిచేసిన గుజరాత్‌లో కానీ, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో కానీ మేం ఇచ్చినట్లుగా 10నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చినట్లు రికార్డ్ ఉందా? నేను చర్చకు సిద్ధం. విజ్ఞతతో ఉద్యోగాలిచ్చాం. ప్రజాపాలనతో దేశానికే తెలంగాణ ఓ మోడల్‌గా నిలబడింది’ అని పేర్కొన్నారు.
తనకు పరిపాలనపై పట్టు రాలేదని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘వ్యవస్థ అంతా గత ప్రభుత్వం నాటిదే ఉంది కదా. ఆనాడు కోదండరామ్ తలుపులు బద్దలుకొట్టిన అదే పోలీసులు ఈరోజు నేను ఆదేశిస్తే కేటీఆర్ తలుపులు పగులకొట్టి వంగబెట్టి దంచరా? కానీ నేను అలాంటి విధానానికి వ్యతిరేకం. సచివాలయానికే రాని మీకు పట్టు ఉందా? రోజుకు 18 గంటలపాటు పనిచేస్తున్న నాకు, మా సీతక్కకు పరిపాలనపై పట్టు లేదా?’ అని ప్రశ్నించారు.