మావోయిస్టులను మట్టుపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ, చత్తీసఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మావోయిస్టులను చర్చలకు పిలవాలని శాంతిసంఘం సభ్యులు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని అభ్యర్ధించారు.
ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రివర్గ సహచరులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తనను కలిసిన ప్రతినిధి బృందానికి రేవంత్ హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పనిచేసినప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపారని, అప్పట్లో మంత్రిగా ఉన్న జానారెడ్డి చర్చలకు అనుసంధానకర్తగా వ్యవహరించారని, ఆయనతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే విషయాన్ని నిర్ణయిస్తామని రేవంత్ పేర్కొన్నారు. అయితే సోమవారం ఉదయం బంజారాహిల్స్లోని జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ ఆపరేషన్ కగార్పై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. శాంతిసంఘం సభ్యులు తనతో జరిపిన చర్చల వివరాలను సీఎం జానారెడ్డికి వివరించారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కే. కేశవరావు కూడా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టు నేతలతో చర్చలు జరిపిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ కీలక పాత్ర పోషించారు. జానారెడ్డి నివాసం నుంచి దిగ్విజయ్సింగ్కు ఫోన్ చేసిన రేవంత్ అప్పట్లో మావోయిస్టులతో జరిపిన చర్చల వివరాలను, చర్చలకు దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర నేతలతో చర్చించారు.