CM Revanth : ఢిల్లీకి సీఎం రేవంత్.. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనున్న సీఎం
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ పార్టీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఈ ధర్నాలో సీఎం రేవంత్ పాల్గొంటారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను ఆమోదించేలా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేలా మూడు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేతలు సైతం పాల్గొననున్నారు.