CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అజెండా ఇదే

Update: 2025-05-02 08:30 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. సాయంత్రం పార్టీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం(సీడబ్ల్యూసీ)లో పాల్గొంటారు. జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంత రించుకుంది. కులగణనను వెంటనే చేపట్టేలా కేంద్రాన్ని కోరాలని ఈ ప్రక్రియ పూర్తయ్యాక బీజేపీ కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పాలని ప్రధాని మోడీనికాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయనున్నట్టు సమాచారం. తెలంగాణాలో చేపట్టిన కులగణన, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను సీఎం రేవంత్ ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీతో నిర్వహించిన కులగణన ప్రక్రియ, ఈ అంశంలో ఎంతమంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు, ఒక్కో ఎన్యుమరేటర్ కు 150 ఇళ్లను కేటాయించి ఏ విధంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన క్రమాన్ని సీఎం ఈ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. పార్టీ పెద్దలంతా ఒకే భేటీలో కలుస్తున్నందున మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జపాన్ పర్యటన తర్వాత పార్టీ పెద్దలను కలిసి తన పర్యటన వివ రాలను వివరించాలని సీఎం రేవంత్ భావించారు. అనుకోకుండా సీడబ్ల్యూసీ భేటీ ఖరారు కావడంతో అన్ని అంశాలను అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ప్రతిపాదించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీకి రాష్ట్రానికి చెందిన సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి కులగణనను జాతీయ స్థాయిలో చేపట్టాలని అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం అందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తలొగ్గి సానుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన్ను ఈ సందర్భంగా సన్మానించాలని రేవంత్ నిర్ణయించినట్టు సమాచారం.

Tags:    

Similar News