REVANTH: పదేళ్లు అధికారం మాదే: రేవంత్ రెడ్డి
ప్రజలు ఆ అవకాశం ఇస్తారన్న ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ మాట ఇస్తే వెనక్కి తగ్గదన్న రేవంత్;
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. 1994 నుంచి 2004 వరకు ఒక పార్టీ, 2004 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీ, 2014 నుంచి 2024 వరకు మరో పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా 2024 నుంచి 10 ఏళ్ల వరకు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పదేళ్ల పాటు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని ప్రామిస్ చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 పథకాలను ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులందరికీ రైతు భరోసా చెక్కులు అందజేశారు.
కాంగ్రెస్ మాట ఇస్తే.. వెనక్కి తగ్గదు
కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎప్పటికీ వెనక్కి తగ్గదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. సోనియాగాంధీ తెలంగాణను ఇస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. గత పదేళ్లు రాష్ట్రం అంధకారంలో ఉంది. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. పూర్తైన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. అయినా సాగు విస్తీర్ణం పెరిగింది’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్
వీసీల నియామకం UGC ద్వారా చేపట్టే యత్నం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది? కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే. ఇతర సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతాం. రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తోంది’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం ఫైర్
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క స్పందించారు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఐదుగురిలో ఒక్కరికి కూడా అవార్డులు ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. పద్మ అవార్డుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఇక మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడం అభినందనీయమని భట్టి అన్నారు.