REVANTH: రైతుల కష్టం నాకు తెలియదా : రేవంత్‌రెడ్డి

లగచర్ల భూ సేకరణపై రేవంత్ కీలక వ్యాఖ్యలు... మాయగాళ్ల మాటలు నమ్మవద్దన్న సీఎం;

Update: 2024-12-01 03:00 GMT

లగచర్ల భూ సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని, సహకరించాలని భూ నిర్వాసితులకు విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలన్నదే తన తపన అని అన్నారు. మాయగాళ్ల మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. పాలమూరులో భూమిని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే చరిత్ర తనను క్షమించదని రేవంత్ అన్నారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం, సాగర్‌ కట్టేవాళ్లా అంటూ చెప్పుకొచ్చారు. విపక్షాల ఉచ్చులో పడొద్దన్నారు. కుటుంబాలను నాశనం చేసుకోవద్దన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ‘లగచర్ల’లో చిచ్చుపెట్టి అధికారులు, కలెక్టర్‌పై దాడులు చేయించారని... వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయారని పేర్కొన్నారు.

కేసీఆర్, కేటీఆర్ ఫామ్‌హౌస్‌లకు పోతారు

కేసీఆర్‌, కేటీఆర్‌ పరిశ్రమలు అడ్డుకుని ఫాంహౌస్‌కు పోతారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రైతు కష్టం తనకు తెలియదా అంటూ పేర్కొన్నారు. కొడంగల్‌లో పారిశ్రామిక పార్కులు నిర్మించి ఉద్యోగాలు తేవాలని తాను అనుకున్నానన్నారు. కానీ, లగచర్లలో గొడవ చేసి మంట పెట్టారన్నారు. బీఆర్ఎస్‌ మాయమాటలు నమ్మి గిరిజనులు జైళ్లకు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వనని.. కొడంగల్‌లో పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 25 వేల ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు. నల్లమలలో పుట్టి పెరిగా.. మీ లాంటి గుంట నక్కలకు భయపడనన్నారు. పాలమూరు వాళ్లకు పని చేయడమే తెలుసు.. గొప్పలు చెప్పుకోరన్నారు. రైతులే మా బ్రాండ్‌ అంబాసిడర్లు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు..

పదేళ్లు అధికారంలో ఉండి, పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే లక్ష కోట్లు ఖర్చు చేస్తే, ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని విమర్శించారు. మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసొప్పలేదని మండిపడ్డారు. ఎవరెవరో వచ్చి మన జిల్లాను దత్తత తీసుకుంటామని అన్నారని వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.

Tags:    

Similar News