తెలంగాణ సీఎం రేవంత్ ( Revanth Reddy ) రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. తొలుత తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట. రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పరిపాలన, అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టారు.
సీఎం పర్యటన నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో పర్యటించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. తానే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాట్లు చెప్పారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి హాస్సిటల్ పనులను, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
సర్కారు దవాఖానాను ప్రతి పేదవాడు ఓన్ చేసుకునేలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి. కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రిలో సుమారు 600కు పైగా ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉందన్నారు. దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు మంత్రి. సీఎం పర్యటనలో ఉమ్మడి జిల్లాలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు మంత్రి దామోదర.