రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుందని, మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందని సీఎం వివరించారు.
జిల్లాల సంఖ్యను కుదిస్తామని తానెప్పుడూ చెప్పలేదని సీఎం రేవంత్ అన్నారు. వాటిని హేతుబద్ధీకరించేందుకు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని మాత్రమే చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో జనాభా పరంగా భారీ తేడా ఉందని, అందుకే వాటిని హేతుబద్ధీకరించాలని తెలిపారు. జిల్లాలు, మండలాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటుకు బడ్జెట్ సమావేశాల్లో అందరి అభిప్రాయం తీసుకుంటామని ఢిల్లీలో మాట్లాడారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఎక్కువ మంది బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పినట్లు టాక్. తాజా విస్తరణలో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసి, రెండు పదవులను పెండింగ్‌లో పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.