సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. హాస్టల్ బాత్ రూమ్‌లో వీడియోలు చిత్రీకరించారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున్న ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్ సహా ఏడుగుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి వేలిముద్రలను దర్యాప్తు బృందం సేకరించింది. రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది. కమిషన్ కార్యదర్శి పద్మజారమణ వసతిగృహానికి వచ్చి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. వీడియోల చిత్రీకరణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో.. కళాశాలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది యాజమాన్యం.