TS : తుక్కుగూడ సభలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో

Update: 2024-04-03 05:08 GMT

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈ నెల 6న 'జన జాతర' పేరుతో కాంగ్రెస్ (Congress) మరోసారి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభా ఏర్పాట్లకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రులు, పార్టీ నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు. సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. తుక్కుగూడ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్లు తెలిపారు.

తుక్కుగూడ సభలో ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు. సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రాష్ట్రానికి జరిగే మేలును ఈ సభ ద్వారా తెలియజేస్తామన్నారు. సోనియా గాంధీ దయ, ప్రేమ వల్ల రాష్ట్రం ఏర్పాటైందని, ప్రజలకు సూపర్ సిక్స్ గ్యారంటీలు ఇచ్చారని తెలిపారు. మిగిలిన హామీలు ఎన్నికల తరువాత అమలు చేస్తామని చెప్పారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని కొనియాడారు.

మహిళా విభాగానికి సంబంధించిన ఏర్పాట్లను సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకమని రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది సోనియాగాంధీ వల్లేనని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది ఈ సభకు తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు.

Tags:    

Similar News