లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ (Congress).. ఈరోజు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా సమరశంఖం పూరించనుంది. సాయంత్రం 4.30గంటలకు ‘జన జాతర’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. నిన్న ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ తెలుగులో విడుదల చేస్తారు. సభకు 10లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. రేవంత్‌రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.సభ నేపథ్యంలో.. సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి శుక్రవారం పలు సూచనలు చేశారు.
సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. ఖమ్మం, నల్లగొండ నుంచి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనదారులు పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్ లేదా సర్వీసురోడ్డు నుంచి బొంగుళూరు టోల్‌కు వెళ్లే మార్గంలో రావిర్యాల టోల్‌వద్ద ఎడమవైపు తిరిగి ఫ్యాబ్‌సిటీ వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి. మాల్, ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ హైవే, మహబూబ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్ బొంగుళూరు టోల్ నుంచి రావిర్యాల టోల్ వద్దనుంచి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.