హైదరాబాద్ మహా నగరానికి మూసీ నది ఒక వరమని, ఆ వరాన్ని మురికి కూపంగా మార్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగోల్‌లోని ఎస్టీపీ కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. గత పాలకుల పాపం వల్ల మూసీ మురికిగా మారిందన్నారు. గత పాలకులు అంటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీనే అని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్ హైదరాబాద్‌లో ఉందన్నారు. ప్రతి రోజు ఉత్పత్తి అయ్యేది 2వేల ఎల్‌ఎండీల మురికి నీళ్లు అని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ఎస్టీపీతోనే ఇప్పుడు 20 కోట్ల లీటర్ల మురికినీరు శుద్ధి అవుతోందని తెలిపారు. అసలు హైదరాబాద్‌కు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన పనులకే రిబ్బన్లు కట్ చేస్తూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు.