బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారని, తమ ఫిర్యాదులో అన్నారు. శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు.
కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ మహిళా నేతలు మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డిని వెంటనే డిస్ క్వాలిఫై చేయకుంటే సమాజంలో మహిళలకు మరింత అవమానం జరిగే ప్రమాదం ఉంటుందని. తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు చీర కట్టుకొని, గాజులు తొడుక్కోవాలంటూ బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అదే రోజున ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ మహిళా నేత, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డికి ఒకటి చూపించాలనుకుంటున్నాం.. అంటూ చెప్పు తీసి చూపించారు. కౌశిక్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇంకోసారి అలా మాట్లాడితే ఈ చెప్పుతోనే దెబ్బలు తినాల్సి వస్తుంది" అంటూ మహిళా నేతలు వార్నింగ్ కూడా ఇచ్చారు.