Electric Shock: వేటగాళ్ల అకృత్యానికి నిండు ప్రాణం బలి

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇద్దరు మృతి

Update: 2024-02-12 22:30 GMT

జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వేటగాళ్ల అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. వన్యప్రాణులను వేటాడేందుకు అడవుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ దుర్ఘటనలో భూపాలపల్లిలో గ్రేహౌండ్స్ కమాండో ప్రవీణ్ మృత్యువాత పడ్డారు. ములుగు జిల్లాలోనూ వేటగాళ్లు ఉచ్చులు తగిలి ఓ రైతు చనిపోయాడు.

అడవుల్లో జంతువులను వేటాడేందుకు బిగుస్తున్న ఉచ్చులుమూగజీవాలనే కాదు ప్రజల ప్రాణాలనూ బలిగొంటున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వేటగాళ్ల ఘాతుకానికి ఓ గ్రేహౌండ్స్ కమాండో మృత్యువాత పడ్డాడు. 2012 బ్యాచ్‌కి చెందిన గ్రేహౌండ్స్ కమాండో ఆడే ప్రవీణ్ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌ మండలం రాజోలునూడ వాసి. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కాటారం మండలం శివారు ప్రాంతాల్లో.... గాలింపు చర్యలు చేపడుతుండగా వన్యప్రాణుల వేట కోసం వేసిన విద్యుత్‌ ఉచ్చు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. కానిస్టేబుల్‌ను హుటాహుటిన భూపాలపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. దీంతో.....ఇటు కాటారంలోనూ.... అటు స్వగ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

ములుగు జిల్లాలోనూ ఇదే తరహా దారుణం చోటుచేసుకుంది. గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెంలో అటవీ జంతువుల కోసం అమర్చిన ఉచ్చుకు తగిలి పిండి రమేష్ అనే రైతు చనిపోయాడు. రెండు జిల్లాల్లోనూ వేటగాళ్ల ఆగడాలు ఇటీవల కాలంలో పెచ్చుమీరాయి. కొందరు వ్యక్తులు కాసులకు కక్కుర్తి పడి వన్యప్రాణులను హతమార్చడమే పనిగా పెట్టుకున్నారు. కానీ వాటి కోసం అమర్చిన ఉచ్చులు, విద‌్యుత్ తీగలు తగలి అమాయకులు బలవుతున్నారు.

అటవీ ప్రాంతాల్లో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టి వేటగాళ్ల ‌అకృత్యాలకు అడ్డుకట్ట వేయకుంటేఇదే తరహా ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదు 

Tags:    

Similar News