నామినేటెడ్ పోస్టుల భర్తీపై సొంత పార్టీనేతలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముదిరాజ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చర్చనీయాంశం అయ్యాయి. మహిళా లీడర్లను కోరిన పదవులతో శాంతింపచేయాలని సీనియర్లు సూచనలు ఇస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న సునీతారావు గురువారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టీపీసీసీ కార్యవర్గంలో మహిళలకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారని, తమకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ ప్రాధాన్యత ఇవ్వక పోతే గాంధీభవన్ మెట్లపై కూర్చుని కొట్లాడుతామని, మంత్రులను నిలదీస్తామని హెచ్చరించారు. ఇప్పుడు తమకు దక్కిన పదవులన్నీ సభ్యత్వ నమోదు ఆధారం గా గుర్తింపు ఇచ్చినవేనని తెలిపారు. తాను బీసీ మహిళననీ, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి అన్ని విధాలా అర్హురాలినని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో 150 కి పైగా కేసులు మహిళా కాంగ్రెస్ నేతలపై నమోదయ్యాయని, శాసనసభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వీరోచితంగా పోరాడామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని సునీతారావు వెల్లడించారు. ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ అయ్యారని, తమకు కూడా పదవులు ఇవ్వాలని కోరారు.