DRUGS: హైదరాబాద్‌లో ఏకంగా డ్రగ్స్ సామ్రాజ్యమే
కలకలం రేపుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీ భాగోతం
పేరుకే ల్యాబ్.. లోపల మాత్రం డ్రగ్స్ డెన్. ఇన్నాళ్లూ డ్రగ్స్ మాత్రమే పట్టుబడింది. కానీ ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ సామ్రాజ్యమే వెలుగు చూసింది. ఇది ఎక్కడో కాదు. మన హైదరాబాద్ అడ్డగానే డ్రగ్స్ ప్రాసెస్ జరుగుతోంది. మహారాష్ట్రలో ఒక చిన్న క్లూతో మొదలైన వేట... హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ బండారం బట్టబయలు చేసింది. మహారాష్ట్ర పోలీసుల బిగ్ ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్ డెన్ బయటపడింది. హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ తయారీ సిండికేట్‌ను మహారాష్ట్రలోని మిరా-భయందర్ పోలీసులు ఛేదించారు. చర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి 32 వేల లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువల అక్షరాల 12 వేల కోట్ల.. ఈ ఆపరేషన్‌లో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 200 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను మాత్రమే పట్టుకున్నారు. వాటి విలువ 25 లక్షలు. లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ భారీ డ్రగ్ సిండికేట్ వెలుగులోకి వచ్చింది.
సీక్రెట్ టీమ్‌తో స్పెషల్ ఆపరేషన్
మహారాష్ట్రకు చెందిన మిరా-భయందర్ పోలీసులు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. తమ సీక్రెట్ టీమ్‌ను రంగంలోకి దించి వారాల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ముఠా మూలాలు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు. ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన మోలీ, ఎక్స్‌టీసీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. మిథైలెనెడియాక్సీ మెథాంఫెటమైన్ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో కూడా ఈ ముఠా పెద్ద నెట్‌వర్క్‌ను నడుపుతుంది. డ్రగ్స్ తయారీ కోసం ఆధునిక మెషిన్లు ఉపయోగించినట్లు గుర్తించారు.
రేవంత్ సర్కార్‌కు సవాల్
మాదక ద్రవ్యాల కట్టడికి ఎన్ని రకాల చర్యలు చేపట్టినా… తమను అడ్డుకునే వాళ్లు లేరన్నతీరుగా స్మగ్లర్లు పాలకులకు సవాల్ విసురుతున్నారు. స్మగ్లర్లు మాదక ద్రవ్యాలను యథేచ్ఛగా అమ్మడమే కాదు.. యూనివర్సిటీలు, కాలేజీలు, చివరకు పాఠశాలలు, ఐటీ కంపెనీల సెంటర్లను తమ అడ్డాలుగా మార్చుకున్నారని తెలుస్తున్నది. ఇటీవలే మహేంద్ర యూనివర్సిటీలో మాదక ద్రవ్యాలు దొరకడం కలకలం రేపిన విషయం అందరికి తెలిసిందే. మాదక ద్రవ్యాల వినియోగపై కాంప్రెన్సివ్ నేషనల్ సర్వే (2019) ప్రకారం తెలంగాణలో 19.07 లక్షల మందికి వివిధ మాదక ద్రవ్యాల వినియోగ వ్యసనం ఉన్నట్లు తెలిసింది. ఇది దేశంలోని వ్యసన పరులలో 2.47 శాతంకు సమానమని పేర్కొన్నది. మాదక ద్రవ్యాల కేసులను పరిశీలిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద 2014లో 148 అరెస్టులు జరిగితే 2023లో 1218 కేసులలో 1991 మంది అరెస్టు కాగా 20,904 కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. 2024 జనవరి నుంచి జూన్ వరకే 1982 కేసులు నమోదు చేసి 3,792 మంది అరెస్టు చేసి, రూ.179 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను, రూ. 47 కోట్ల ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులు చెపుతున్నాయి.
హైదరాబాద్‌లో తయారీ యూనిట్లా..?
మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న తీరు.. మరో వైపు ఇక్కడే తయారీ యూనిట్లు వెలిసిన తీరును పరిశీలిస్తే స్మగ్లర్లు తమనేమీ చేయలేరంటూ పాలకులకు సవాల్ విసురుతున్నారని పరిశీలకులు అంటున్నారు. స్మగర్లకు కూడా బడా నేతలతో ఏవైనా సంబంధాలు పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత వరుసగా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. కేంద్రం 1985లో తీసుకు వచ్చిన ఎన్డీపీఎస్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. జామీన్లు ఇవ్వకుండా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి, సెక్షన్ 27(ఏ) కింద మాదక ద్రవ్యాల ట్రాఫికింగ్, ఫండింగ్ కింద శిక్షలు విధించారు. ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి అధికారులకు ప్రత్యేక అధికారాలు కల్పించారు. టాలీవుడ్ డ్రగ్ కేసులు వెలుగులోకి రాగానే ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి సినీ ప్రముఖులు, కాలేజీ విద్యార్థులపై విచారణ జరిపించారు.