దుబ్బాక ఉప ఎన్నిక : ప్రచారాన్ని హోరెత్తిస్తున్న అభ్యర్థులు

దుబ్బాక ఉప ఎన్ని కోసం అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.. రామలింగారెడ్డి ఆశయ సాధన కోసం తాను ప్రజల ముందుకు వస్తున్నట్లు దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట..

Update: 2020-10-19 02:47 GMT

దుబ్బాక ఉప ఎన్ని కోసం అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.. రామలింగారెడ్డి ఆశయ సాధన కోసం తాను ప్రజల ముందుకు వస్తున్నట్లు దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత చెప్పారు. చేగుంట మండలంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కసన్‌పల్లి, పోతనపల్లి, చెట్టు తిమ్మైపల్లి, నడుమ తాండ, పెద్దశివనూర్‌, చిన్న శివనూర్‌ గ్రామాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవందర్‌ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో మహిళలు బతుకమ్మ, బోనాలతో వారికి ఘన స్వాగతం పలికారు. చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో ఆడపడుచులతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవంద్‌ రెడ్డి బతుకమ్మ ఆడారు.

రామలింగారెడ్డిలా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సోలిపేట సుజాత చెప్పారు.. అటు రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తుంటే, బీజేపీ కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతులకు మీటర్‌ పెట్టాలని చూస్తోందని టీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు.. దుబ్బాక ఉప ఎన్నికలో సోలిపేట సుజాతను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

సిద్ధిపేటలో ఎమ్మెల్యే క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో తొగుట మండలం పల్లెపహాడ్‌ గ్రామస్తులు మంత్రి హరీష్‌రావుతో సమావేశమయ్యారు. ముంపు గ్రామాల ప్రజల త్యాగం మరువలేనిదని.. పల్లెపహాడ్ గ్రామస్తులు చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు.

దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లిలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్ పార్టీపై మండిపడ్డారు. బీజేపీకి ఓటేస్తే పింఛన్ కట్ చేస్తామని, డబుల్ బెడ్ రూం ఇండ్లు రావని ఓటర్లను భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి బీజేపీకి ఓటు వేయొద్దని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పెన్షన్ ఆపే అధికారం ఎవరికీ లేదని రఘునందన్ రావు అన్నారు. అటు కాంగ్రెస్‌ కూడా ప్రచారాన్ని వేగవంతం చేసింది.. గెలుపే లక్ష్యంగా గ్రామ గ్రామాన హస్తం నేతలు తిరుగుతున్నారు.. హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Tags:    

Similar News