తెలంగాణలోని విద్యాసంస్థలకు ఈ దసరా పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రాంరభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 2025, ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. 2025 ఫిబ్రవరి 28వ తేదీ లోపు పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2025 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.