దసరా సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెలవుల్లో రివిజన్ కోసం విద్యార్థులకు కొంత హోమ్ వర్క్ ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూ.కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రకటించారు. అక్టోబర్ 3వ తేదీకి స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. దసరా వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తారు. తెలంగాణలో దసరా పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. దేవీ నవరాత్రుల కోసం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తారు. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. బతుకమ్మ ఆట, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక, ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీన వచ్చింది.