Telangana ED: తెలంగాణలో ఈడీ వేడి.. డ్రగ్స్ వ్యవహారంపై దూకుడు
Telangana ED: తెలంగాణలో ఈడీ వేడీ కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ దూకుడు పెంచింది.;
Telangana ED: తెలంగాణలో ఈడీ వేడీ కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ దూకుడు పెంచింది. వ్యాపార లావాదేవీలతో పాటు బ్లాక్ మనీ వ్యవహారంలో కాసేపట్లో ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరకానున్నారు.
వ్యక్తిగత బ్యాంకు వివరాలతో ఈడీ కార్యాలయంకు రావాలని ఈడీ రోహిత్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. 2015 ఏప్రిల్ నుండి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు కూడా అందించాలని కోరింది. దీంతో పాటు విదేశీ పర్యటనలపై ఈడి ఇచ్చిన ఫార్మెట్లో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
మరోవైపు ఎన్నికల అఫిడవిట్‌లో రోహిత్ రెడ్డి విద్యార్హతలపై కూడా వివాదం కొనసాగుతుంది. విద్యార్హతలు, కేసుల వివరాలను కూడా సమర్పించాలని అధికారులు నోటీసులో తెలిపారు. ఇక ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ తో పాటు 10 అంశాల బయోడేటా వివరాలతో విచారణకు రావాలని ఆదేశించింది.. ఈడీ. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు రానున్నారు.
ఈడీ విచారణపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కావాలనే కుట్ర పూరితంగా బీజేపీ వ్యవహారిస్తుందని ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ బెదిరింపులకు తాము భయపడబోమని.. తెలంగాణలో కమలం ఆటలను సాగనివ్వమని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు డ్రగ్స్ కేసులోనూ ఈడీ విచారణ వేగవంతం చేసింది. టాలీవుడ్ కు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించింది. తాజాగా ఇవాళ నటి రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్‌ను గతేడాది విచారించిన ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో రకుల్ విచారణ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పూర్తిస్థాయిలో విచారించక పోవడంతో మరోసారి హాజరు కావాలని ఆదేశించారు.