Telangana Engineering Fees : తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజనీరింగ్ ఫీజులు..

Telangana Engineering Fees : తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి;

Update: 2022-09-06 10:11 GMT

Telangana Engineering Fees : తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. తెలంగాణలోని ప్రముఖ కాలేజీలు సహా 36 కాలేజీల్లో ఫీజు లక్ష రూపాయలు దాటింది. ఏడు కాలేజీల్లో ఫీజు లక్షన్నర దాటింది. రాష్ట్రప్రభుత్వం ఫీజులపై జీవో ఇవ్వకుండానే కౌన్సిలింగ్ ప్రారంభించడంతో...కాలేజీలు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఇప్పటివరకు 79 ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టు నుంచి అనుమతి పొందగా..మరికొన్ని కాలేజీలు అదే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ కాలేజీలను సవరిస్తారు. మూడేళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫీజుల సమీక్ష కోసం రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. కాలేజీలు ఫీజులు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించగా...యాజమాన్యాలను AFRC అధికారులు పిలిపించి చర్చించారు. దీంతో కాలేజీ యాజమాన్యాలు అంగీకరించిన ఫీజులను AFRC రిజిస్టర్‌లో నమోదు చేసింది. ఐతే కరోనా పరిస్థితులు, ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించిన AFRC గత నెల 1న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

ఐతే నివేదికపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకముందే..గత నెల 21 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. AFRC ఎదుట తాము అంగీకరించిన ఫీజుల వసూలుకు అనుమతించాలని కోర్టును కోరాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం, మరోవైపు కౌన్సిలింగ్ ప్రారంభమైనందున ప్రవేశాల్లో ఆలస్యం జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

AFRC వద్ద అంగీకరించిన ఫీజుల వసూలు చేసుకునేందుకు కాలేజీలకు అనుమతించింది. ఐతే వసూలు చేసిన ఫీజులు పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడి ఉండాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పాతఫీజులకు, కొత్త వాటికి మధ్య పెరిగిన సొమ్మును కాలేజీల బ్యాంకు ఖాతాల్లోనే ఉంచాలని..ఒక వేళ తుదితీర్పు కాలేజీలకు వ్యతిరేకంగా వస్తే తిరిగి చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు CBITలో లక్షా 75 వేలు, వాసవి, వర్ధమాన్, సీవీఆర్, BVRIT మహిళ కాలేజీలో లక్షా 55 వేలు, శ్రీనిధి, VNR విజ్ఞాన్‌ జ్యోతిలో లక్షన్నర , MVSRలో లక్షా 45 వేలకు ఫీజులు చేరాయి. ఐతే హైకోర్టు ఆదేశాల మేరకు ఫీజు ఎంత మేర పెరిగిందనే వివరాలను కౌన్సిలింగ్ సమయంలో అధికారులు వెల్లడించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఇక ఇవాళ మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 13 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వ నిర్ణయం కోసం..బీసీ,ఈబీసీలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎస్సీ,ఎస్టీలు, గురుకులాల్లో చదివిన వారితో పాటు పదివేల ర్యాంకు వరకు విద్యార్థులందరికీ ప్రభుత్వమే పూర్తి ఫీజు చెల్లిస్తోంది. ఐతే పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు మాత్రం 35 వేలు మాత్రమే రీఎంబర్స్‌మెంట్‌ ఇస్తుండగా..మిగతా ఫీజు విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 35 వేల వార్షిక ఫీజు ఉన్న కాలేజీలు నాలుగైదు మాత్రమే ఉన్నాయి. మరోవైపు ఫీజులు భారీగా పెరగడంతో పదివేల ర్యాంకు దాటిన బీసీ,ఈబీసీ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య మరింత భారంగా మారనుంది. బీసీ,ఈబీసీలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పెంచాలన్న ఆయా శాఖల ప్రతిపాదనలపై ప్రభుత్వం తేల్చకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Tags:    

Similar News