అప్పుల బాధతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కౌడిపల్లి మండలం కుషన్ గడ్డ తండాలో ఇవాళ చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం... తండాకు చెందిన పాల్య జీవుల (50) తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. పెట్టుబడికి రూ.2లక్షల వరకు ఖర్చు అయ్యింది. అయితే కొంత కాలంగా నీటి తడులు అందక పంట ఎండిపోయింది. పంటను రక్షించు కునేందుకు నెలరోజుల్లోనే మూడు బోర్లు వేయించాడు. కానీ ఎందులోనూ నీళ్లు రాలేదు. బోర్ల తవ్వకం కోసం మరో రూ. 3లక్షలు అప్పు అయ్యింది. పంట సాగు, బోర్ల తవ్వకం కోసం చేసిన ఐదు లక్షల అప్పుకు వడ్డీ పెరుగుతుండగా, అది ఎలా తీర్చాలో తెలియక మనస్థాపానికి గురయ్యాడు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిని వ్యక్తి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఇవాళ ఉదయం రాజిపేట శివారులోని అడవిలో వెతుకుతుండగా చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.