కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ (Feroze Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఎంపీగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశించిందని అన్నారు. ఈమేరకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే డిసైడ్ చేశారని, తమ కెప్టెన్ ఏది చెబితే అదే చేస్తానని అన్నారు. వ్యక్తిగతంగా తాను అసదుద్దీన్‌తో కొట్లాడుతూనే ఉంటానన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఎవరు ఎవరితో దోస్తీ చేస్తున్నారో తెలియని అయోమయం అందరిలోనూ నెలకొంది.
కాగా, హైదరాబాద్ పార్లమెంట్ బరిలో బీజేపీ నుంచి విరించి హాస్పిటల్ అధినేత్రి మాధవీలత బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో పవర్‌లో ఉన్న కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్ధిని ప్రకటించ లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ తీరు పలు అనుమానాలకు దారి తీస్తుంది.
అయితే, కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీపై ఇటీవల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం మాటలతో కత్తులు దూసిన నేతలు.. ఇటీవల ప్రశంసలతో ముంచెత్తుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత.. రేవంత్ రెడ్డి.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రొటెం స్పీకర్ గా అవకాశమిచ్చారు. అంతేకాకుండా.. బ్రిటన్ లో పర్యటించిన సమయంలో లండన్ లో సీఎం రేవంత్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు.. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య గ్యాప్ తగ్గుతూ వచ్చింది.